గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (10:40 IST)

కోడికూరలో పురుగులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు

దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటి. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విద్యార్థుల వసతి గృహాల్లో మాత్రం నాసికరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనితోడు వంట సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా మహిళా వసతి గృహంలో వండిన చికెన్ కర్రీలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడీస్ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని, అక్కడున్న సిబ్బందని నిలదీశారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
 
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. ఈ ఆందోళన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగింది.