మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

దమ్మున్నోడు రేవంత్.. ఎమ్మెల్యే పదవికి రిజైన్... టీడీపీలో ముగిసిన శకం

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి శకం ముగిసింది. పార్టీ ప్రాథమిక సభ్వత్వం, పార్టీలో బాధ్యతలు, చివరకు తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. తద్వారా సైకిల్ లేదా ఫ్యాన్ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో మంత

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి శకం ముగిసింది. పార్టీ ప్రాథమిక సభ్వత్వం, పార్టీలో బాధ్యతలు, చివరకు తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. తద్వారా సైకిల్ లేదా ఫ్యాన్ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో మంత్రిపదవుల్లో ఉన్న టీడీపీ, వైకాపా ఎమ్మెల్యేలకు సవాల్ విసిరినట్టయింది. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శికి రాజీనామా లేఖలను ఇచ్చారు. అలాగే, స్పీకర్ ఫార్మెట్‌లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ లేఖ కాపీని పార్టీ అధినేతకు కూడా పంపారు. 
 
కాగా, తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు... తెలంగాణ టీడీపీ నేతలతో శుక్రవారం హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇక్కడ అన్ని విషయాలపై చర్చిచేందుకు వీలు లేకపోవడంతో శనివారం అమరావతికి టీడీపీ నేతలను ఆహ్వానించారు. దీంతో శనివారం ఉదయం ఇతర టీడీపీ నేతలతో పాటు.. రేవంత్ రెడ్డి కూడా అమరావతికి వెళ్లారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. 
 
క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలుసుకున్న రేవంత్.. మాట్లాడాల్సింది చాలా ఉందనీ.. పర్సనల్‌గా కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారు. అయితో సెంట్రల్ కమిటీ సమక్షంలో అన్ని విషయాలు ఓపెన్‌గా మాట్లాడుకుందామనీ వెయిట్ చెయమని చెప్పి చంద్రబాబు పాత్రికేయుల సమావేశానికి వెళ్లారు. కానీ, రేవంత్ ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా, ఆయన వ్యక్తిగత కార్యదర్శికి రాజీనామాలేఖను ఇచ్చి లంచ్ చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయల్దేరి నేరుగా కొడంగల్ చేరుకున్నారు. 
 
చంద్రబాబుకు ఇచ్చిన లేఖలో చాలా విషయాలను రేవంత్ ప్రస్తావించారు. చంద్రబాబు నాయకత్వంలో చేసిన పోరాటాలు మంచి అనుభవాన్ని ఇచ్చాయనీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతతో కలిసి నడవడం సంతోషంగా ఉందన్నారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు ఇచ్చారనీ, సీనియర్లు ఉన్నా.. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. 
 
టీడీపీతో బంధం తెంచుకోవడం గుండెకోత లాంటిదన్నారు. పార్టీలో లీడర్లే కేసీఆర్‌తో కలవడం బాధగా అనిపిస్తోందనీ, ఇదే విషయాన్ని చెప్పాలని చూస్తుంటే తనపైనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. కాగా రేవంత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా రాజీనామా పార్టీకి చేశారు.