గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (22:06 IST)

బీజేపీలోకి ఈటెల రాజేందర్.. జేపీ నడ్డాతో 45 నిమిషాల పాటు భేటీ

టీఆర్ఎస్ గూటి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 
 
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. అందులో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలుస్తోంది.
 
తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు ప్రస్తుతం అనువైన పరిస్థితులు ఉన్నాయని జేపీ నడ్డాకు వివరించిన ఈటల రాజేందర్.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అందుకు తగ్గట్టుగా నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించినట్టు సమాచారం. 
 
జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ సుమారు 45 నిమిషాలు పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అయితే ఆయన ఎప్పుడు పార్టీలో చేరే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.