శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:34 IST)

#KKavitha పుట్టినరోజు.. 60 అడుగుల భారీ రంగోలీ.. జీవిత విశేషాలు

MP kavitha
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన తెరాస యువనేత పబ్బ సాయిప్రసాద్‌ వినూత్నంగా తన అభిమానం చాటుకున్నారు. 
 
హైదరాబాద్‌ రవీంద్ర భారతి వద్ద 60 అడుగుల భారీ రంగోలి వేయించారు. మహారాష్ట్రకు చెందిన రంగోలి చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి చేతుల్లో ఈ కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 20 గంటల పాటు శ్రమించి కళాకారులు ఈ రంగోలి వేశారు. రవీంద్ర భారతి వద్ద వేసిన ఈ రంగోలీతో సెల్ఫీ తీసుకునేందుకు సందర్శకులు పోటీపడ్డారు.
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా లోక్‌సభ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఘనత సాధించారు. దేశ చరిత్రలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ ఉమెన్‌ విభాగం ఆధ్వర్యంలోని ఎంపీల బృందాన్ని కవిత లీడ్‌ చేశారు. కామన్వెల్త్‌ ఉమెన్‌ పార్లమెంటేరియన్‌ గ్రూపులో సభ్యురాలిగా పని చేశారు. 2014 పార్లమెంట్‌ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో అదే అంశాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు కవిత. కశ్మీర్‌ పండిట్ల అంశంపై చేసిన ప్రసంగం యావత్‌ దేశం మెచ్చింది. 
 
ఇక 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. 2018 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. పార్లమెంట్‌లో వివిధ అంశాలపై తన వాయిస్‌ను వినిపించి దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. 
 
ఇంగ్లిష్‌, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. మహిళా సాధికారతపై విశేషంగా కృషి చేశారు. ఎంపీగా 15లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా నిలిచారు. పెద్ద బాధ్యతను నిర్వర్తించి నిజామాబాద్‌, జగిత్యాల జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. 
 
పసుపు రైతుల చిరకాల కోరిక బోర్డు సమస్యపై ఢిల్లీ వేదికగా నినదించారు. మహిళా సాధికారతపై స్పందించారు. దేశ, విదేశాల్లో అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు. బీడీ కార్మికులకు పింఛన్‌ వచ్చేలా కృషి చేశారు. హైకోర్టు సాధనలో లోక్‌సభలో ముందుడి పోరాటం చేశారు.
 
అలాగే పువ్వులను పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా... విడదీయలేని ఉద్యమ రూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే చెల్లింది. దేశ, విదేశాల్లో తెలంగాణ ఆడబిడ్డలు ఈ రోజు సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ప్రధాన కారణం కవితనే కావడం విశేషం. 
 
తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా చేసిన పోరాటమే ప్రధాన కారణం. నాటి సమైక్య పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే... హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కింది. 
 
వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగ పాఠవం. ఇంకేముంది..? ఎంపీ కవిత మనం కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం..