శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (18:43 IST)

''హే ఊకో'' అవి పిచ్చి మాటలు: రేవంత్ కామెంట్స్‌పై కేసీఆర్ మైక్ కట్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు జ్వరం నుంచి కోలుకున్నట్లున్నారు. జ్వరం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన ఎట్ హోం విందులో పాల్గొనలేని కేసీఆర్.. ఒక రోజు రెస్ట్ తీసుకుని గురువారం మీడియా ముందుకు వచ్చారు.

కేసీఆర్ మీడియా ముందుకు రావడంతో జర్నలిస్టులందరూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఏకిపారేసేందుకేనని అనుకున్నారు. అయితే మీడియా ప్రతినిధులకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. అంతేగాకుండా రేవంత్ వ్యాఖ్యలపై నోరెత్తని కేసీఆర్.. మీడియా అడిగిన ప్రశ్నకు కూడా హే ఊకో.. అవన్నీ పిచ్చి మాటలంటూ మైక్ కట్ చేసి సమావేశాన్ని ముగించారు. 
 
అయితే బుధవారం టీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలవుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తారని మీడియా ఊహించింది. అయితే మీడియా సమావేశంలో కేసీఆర్ రంజాన్ వేడుకలపై మాట్లాడారు. దీంతో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందిస్తారనుకున్న మీడియా అవాక్కైంది. 
 
రంజాన్ వేడుకలపై కేసీఆర్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ వేడుకను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందన్నారు. ఈ నెల 8న నిజాం కాలేజ్ వేదికగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారని కేసీఆర్ చెప్పారు. రంజాన్ పర్వదిన సందర్భంగా రూ.21 లక్షలు ఖర్చు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనాధశరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాదులోని మరో వంద మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. 
 
ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ఓ మసీదులో వెయ్యి మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు 26 కోట్లు కేటాయించినట్టు కేసీఆర్ తెలిపారు. లక్షా తొంభై ఐదు వేల మంది నిరుపేద ముస్లింలకు 500 రూపాయల విలువ చేసే దుస్తులు ఉచితంగా ఇవ్వనున్నామని ప్రకటించారు. రంజాన్ శుభసందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 5001 మసీదుల్లోని ఇమాం, మౌజన్‌లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున జీవన భృతి ఇస్తామని కేసీఆర్ తెలిపారు.