1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (16:16 IST)

నేను చెప్పింది వేదం.. తల తెగినా.. అనుకున్నది సాధిస్తా : కేసీఆర్

తెలంగాణ రాక ముందు సంయుక్తాంధ్ర ప్రదేశ్ నుంచి తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే తాను మళ్లీ అడుగుపెడుతానని చెప్పానని, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గుర్తు చేశారు. అంతేకాకుండా, తనకు తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని అన్నారు. 
 
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో ఉందన్నారు. పెన్షన్ విషయంలో తీవ్రంగా ఆలోచించి ఆలనా పాలనా లేనివాళ్ల కోసమే రూ.వెయ్యి పెన్షన్ ఇస్తున్నామన్నారు. పెన్షన్లు రానివారు అధైర్యపడకుండా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 
 
ప్రతి అర్హునికి పెన్షన్లు ఇస్తామని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. బీడీ కార్మికుల సమస్యలు తనకు తెలుసునని, వారి ఇళ్లలో ఉండి తాను చదువుకున్నానని తెలిపారు. మిషన్ కాకతీయ పేరిటి చెరువుల పూడికలు తీసి పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు.