శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (09:59 IST)

అది స్వచ్చంధంగా వచ్చిన పదవి కాదు... కొనుక్కున్న పోస్ట్: రేవంత్‌పై కౌశిక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు పీసీసీ కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి తన రాజీనామా పత్రాన్ని పంపారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి తన రాజీనామాకు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి సంబంధం లేదన్నారు. ఇది తన సొంత నిర్ణయమని, చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్‌ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 
 
హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. అమ్ముడుపోయింది తాను కాదని.. ఈటల రాజేందర్​కు రేవంత్​ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. 
 
రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయం అని, కార్యకర్తల్లో ధైర్యం నింపారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చోళ్లలా కనపడుతున్నామా? అని ప్రశ్నించారు. 
 
హుజూరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ డిపాజిట్ అయినా​ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కౌశిక్​రెడ్డి సవాల్‌ విసిరారు. ఆరు నెలల్లో కాంగ్రెస్​ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌రెడ్డి సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.
 
'సినిమా యాక్టర్‌లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. సినిమాలో ముమైత్ ఖాన్‌ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు… సీఎం సీఎం అంటే సరిపోతుందా? టీపీసీసీ చీఫ్ పదవి వస్తే ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నారు' అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.