గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (07:52 IST)

చదువుల తల్లులకు కెటియార్ అండ

ఆపదలో ఉన్నవారిని  ఎల్లప్పుడు ఆదుకునే టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్ధినులకు కేటీయార్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. 
 
ఇద్దరు విద్యార్థినుల్లో తల్లిదండ్రులు లేని అనాధ రచన ఒకరు. రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీయార్ తన నివాసానికి పిలిపించుకొని అమె చదువులకు కావలసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హమీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన  రుద్ర రచనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. పదవ తరగతి వరకు స్ధానిక బాల సదనంలో ఉంటూ, జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. 
 
తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడలోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి, ప్రస్తుతం ఈ సెట్ లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో(సిబిఐటి) కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ లో సీటు సాధించింది. అయితే తల్లిదండ్రులు లేని తనకు ఫీజులు కట్టే స్తోమత లేకపోవడంతో రచన పరిస్ధితిని మీడియా ద్వారా తెలుసుకుని కేటీఆర్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. 
 
ఈరోజు రచనను తన బేంగంపేటలోని నివాసానికి పిలిపించుకుని విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల్ని, అవసరమైన ఇతర ఖర్చులను భరిస్తానని, పూర్తి శ్రద్ద విద్యపైనే పెట్టాలని కోరారు. ఈ మేరకు ఫీజులకు కావాల్సిన అర్ధిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సాయం అందుకున్న తర్వాత రచన తనలాగే అనేకమంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కెటియార్ కు విజ్ఞప్తి చేసింది. 
 
కేవలం తన కోసమే కాకుండా తనలాంటి అనాధల పట్ల రచనకి ఉన్న సామాజిక స్పృహను అభినందించిన కేటీఆర్, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. రచనకి ప్రస్తుతం బాగోగులు చూసుకుంటున్న అక్క బావలకి అవసరమైన ఆర్థిక సాయం లేదా ఉపాధికి సంబంధించిన ఇతర సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ కి ఫోన్ చేసి సూచించారు.
 
పేదరికాన్ని జయించి ఐఐటీలో సీటు సాధించిన మేకల అంజలి ఐఐటి ఇండోర్ లో సీటు సాధించింది. వరంగల్ జిల్లా హసన్పర్తి గ్రామానికి చెందిన అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన పెద్ద కూతురు గత ఏడాది ఎంబీబీఎస్లో ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు పొందడంతో తనకున్న భూమిని అమ్మి ఆ ఫీజుల్ని చెల్లించారు. ప్రస్తుతం తన రెండో కూతురు అంజలి కూడా ఐఐటీ ఇండోర్ లో సీటు సాధించినప్పటికీ, ఆమె ఫీజుల్ని చెల్లించేందుకు తన ఆర్థిక స్తోమత సహకరించడం లేదు. 
 
తన తండ్రి బాధల్ని, తాను ఐఐటిలో సీటు పొందిన విషయాన్ని మంత్రి కేటీయార్ కి అంజలి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈరోజు అంజలిని తన నివాసానికి పిలుచుకొని ఐఐటి ఫీజులకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. భవిష్యత్తులో తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని ఈ సందర్భంగా కేటీయార్ కి అంజలి తెలిపారు. 
 
తన కూతురి ఫీజుల కోసం ఆర్థిక సాయం అందించిన కేటీయార్ కి అంజలి తండ్రి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. కేటీయార్ చేసిన ఆర్థిక సాయంతో తమ కుటుంబానికి ఎంతో భరోసా లభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.