బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:42 IST)

ఈ- గోల్కొండ ప్లాట్ ఫాం ఫేమ్ (పోర్టల్)ను ప్రారంభించి కేటీఆర్

తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ - గోల్కొండ ఫ్లాట్ ఫాంను టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే.తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ -గోల్కొండ ద్వారా అద్భుతమైన సాంప్రదాయ కళాకృతులను మరియు చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేనేత మరియు జౌళి శాఖలో ఒక విభాగమైన హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. 
 
ఈరోజు ప్రారంభించిన పోర్టల్ ద్వారా తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ఈ-మార్కెట్ ప్లేస్‌ని తయారుచేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. 
 
ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేట్ ఈ- కామర్స్ వెబ్ సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్ పోర్టల్‌లో సౌకర్యాలను రూపొందించామన్నారు. ఈ వెబ్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులను చేర్చేందుకు వీలుందని, త్వరలోనే అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత, ప్రపంచంలో ఎక్కడికైనా తమ కళాకృతులను పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 
 
ఈ- గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళా కృతిని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డి సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచామన్నారు. ఈ వెబ్సైట్ మొబైల్ ఫోన్ లకు సరిపడే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ ఈ-గోల్కొండ ఫ్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్ మరియు ఇతర అద్భుతమైన  కళాకృతులకు మార్కెటింగ్ మరియు అవసరమైన ప్రచారాన్ని కల్పించే వీలు కలుగుతుందన్నారు. 
 
https://golkondashop.telangana.gov.in/ లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేసే వీలుందన్నారు. 
 
రాష్ట్రంలో అనేక శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ కళను కొనసాగించేందుకు టెక్స్ టైల్ డిపార్మెంట్ తరఫున అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలతో పాటు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని కళాకారులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 
ఈరోజు ప్రగతి భవన్లో జరిగిన ఈ-గోల్కొండ ఆవిష్కరణలో మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ  శంభీపూర్ రాజు, తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ మరియు టెక్స్ టైల్ శాఖ సెక్రటరీ శైలజ రామయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.