శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (10:01 IST)

కేటీఆర్‌కు భద్రత పెంపు.. హైదరాబాద్‌ అభివృద్ధిపై నేడు సమీక్ష

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు భద్రత పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస గెలుపులో ఆయన అత్యంత కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. దీంతో ఆయనకు భద్రతను పెంచుతూ హైదరాబాద్ నగర పోలీసు కషనర్ ఆదేశాలు జారీ చేశారు. 
 
మరోవైపు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌ మంగళవారం ఆయా శాఖ అధికారులతో 'మారథాన్‌ సమీక్ష' చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ వద్ద బుద్ధపౌర్ణిమ భవన్‌లో సమావేశం కానున్నారు. ప్రధానంగా మహానగరంతో ముడిపడి ఉన్న కీలక విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. 
 
విభాగాల వారీగా ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అవసరాలు, ప్రణాళికలు, నిధుల కేటాయింపు, సమీకరణ ఇతరత్రా అన్ని విషయాలపై సమగ్రంగా చర్చిస్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ఎప్పటి నుంచో కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే నగర సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆకాశ మార్గాలు, మురికివాడల లేకుండా చేసేందుకు రెండు పడక గదులు ఇతరత్రా అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. 
 
గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి గల్లీలో తిరిగిన మంత్రి కేటీఆర్‌ సీఎం ప్రణాళిక అనుగుణంగా ప్రజల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అదనంగా కట్టబెట్టారు. ఇందులో భాగంగానే అడుగులు వేసేందుకు మంత్రి కేటీఆర్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో కీలకమైన గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, హెచ్‌ఎండీఏ, జలమండలి, డీటీసీపీ, మెట్రో రైలు ఇతర విభాగాలతో సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.