మెట్రో రైళ్ళలో మహిళల సీట్లలో ఇతరులు కూర్చుంటే కఠిన జరిమానా

hyderabad metro train
శ్రీ| Last Modified సోమవారం, 22 అక్టోబరు 2018 (21:09 IST)
మెట్రో రైళ్ళలో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో పురుషులు తదితరులెవరైనా కూర్చుంటే వారికి కఠిన జరిమానా విధించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ డైరక్టర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎన్వీయస్ రెడ్డి నేడు తెలిపారు.
 
మెట్రో రైల్ భవన్, రసూల్ పురాలో హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్ & టి ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి రూ 500/- వరకూ జరిమానా విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, ప్రతి మెట్రో బోగీలో ఎల్ & టి వారి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు నిఘా అధికం చేయాలని నిర్ణయించారు.
 
ఈ మేరకు మహిళా ప్రయాణీకులు తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సప్ నంబరు కేటాయించాలని ఎన్వీయస్ రెడ్డి సూచించారు. ఈ నిర్ణయాలను త్వరలో అమలుపరుస్తామని ఎల్ టి అధికారులు హామీ ఇచ్చారు. కాగా, మెట్రో స్టేషన్లు, ఆ పరిసర ప్రదేశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు విస్తృతంగా నాటాలని, స్టేషన్ పరిసరాలను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముగ్గురు సభ్యులు గల టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్ఫోర్స్‌మెంటు టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు మెట్రో ప్రయాణీకులకు, పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో కృషి చేయాలని అన్నారు. 
 
ఎల్. బి. నగర్ నుండి మియాపూర్ వరకూ, అలాగే, నాగోల్ నుండి అమీర్ పేట వరకూ  గల మెట్రోమార్గంలో మెట్రో స్టేషన్ ల పరిసరాలలో ఇంకా మిగిలివున్న చిన్నాచితకా సివిల్ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేయాలని, అవసరమైతే తగిన అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియంమించవల్సిందని ఎన్ ఫోర్స్ మెంటు టీం అధికారులను మెట్రో ఎండీ ఆదేశించారు.
 
ఈ సమావేశంలో ఎల్ & టి మెట్రోరైలు, మేనేజింగ్ డైరక్టర్, శ్రీ కె.వి.పి. రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎల్ & టి మెట్రోరైలు, శ్రీ అనిల్ సహాని, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్, ఎల్ & టి మెట్రోరైలు, శ్రీ ఆనందమోహన్, హైదరాబాద్ మెట్రోరైలు ఉన్నతాధికారులు శ్రీ విష్ణువర్థన్, శ్రీ బి.యన్. రాజేశ్వర్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :