స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ ఇదే మంత్రం- విద్యా వ్యవస్థలో మార్పు తప్పదు
గోల్కొండ పరిధిలోని తారామతి భారదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మరిచిపోకూడదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలి. అప్ స్కీల్, రీస్కిల్ చేసుకోకపోతే వెనుకబడిపోతామని కేటీఆర్ పేర్కొన్నారు.
కొత్తగా యూత్ హబ్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యూత్ హబ్‌ను రూ. 6 కోట్ల ఫండ్‌తో ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్‌ను ప్రారంభించుకున్నాం.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద 12 రకాల అంశాలను ప్రవేశపెట్టాం. అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకుండా అత్యుత్తమ బోధన అందించేందుకు డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం.
మన ఊరు మన బడి దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థ పట్ల టీచర్లకు కూడా అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు.
చిన్న పిల్లల్లో సృజనాత్మకత అధికంగా ఉంటుందనే గుర్తు చేశారు. పిల్లల కోసం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. పిల్లలకు ఇష్టమున్న కోర్సులను చదివించాలని కేటీఆర్ సూచించారు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని... అందుకే తెలంగాణ సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ తెలిపారు.