శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 24 అక్టోబరు 2017 (21:39 IST)

ఈ పాపను ఏ తల్లికి ఇవ్వాలి? మీరేమైనా చెప్పగలరా?

పెంచిన తల్లి ఒకవైపు... కన్నతల్లి మరోవైపు. ఆ పాప నాకే కావాలంటే నాకే కావాలని రోడ్డెక్కారు. ఇంతకీ ఏం జరిగిందీ... ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఓ గృహిణికి వరుసగా ఆడపిల్లలే పుడుతుండటంతో ఆమె భర్త చేయరాని పనే చేశాడు. నాలుగేళ్ల క్రితం తన భార్య మరోసారి ఆడబిడ్డనే ప్

పెంచిన తల్లి ఒకవైపు... కన్నతల్లి మరోవైపు. ఆ పాప నాకే కావాలంటే నాకే కావాలని రోడ్డెక్కారు. ఇంతకీ ఏం జరిగిందీ... ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఓ గృహిణికి వరుసగా ఆడపిల్లలే పుడుతుండటంతో ఆమె భర్త చేయరాని పనే చేశాడు. నాలుగేళ్ల క్రితం తన భార్య మరోసారి ఆడబిడ్డనే ప్రసవించడంతో పురిటిలోనే పసిబిడ్డను వేరే వారికి అప్పగించేశాడు. భార్యతో పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పాడు. దానినే నమ్మిన ఆ తల్లి శోకాన్ని దిగమింగుకుని కాలం వెళ్లదీస్తోంది. ఐతే తాజాగా ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు తన పోలికలతోనే వున్న ఆ పాప కంటపడింది. 
 
అక్కడ ఇరుగుపొరుగువారు కూడా ఆ పాప నీ కన్నకూతురులానే వున్నదని అన్నారు. కొందరైతే... ఆ పాప నీ పాపేనంటూ అసలు నిజం బయటపెట్టారు. దీనితో భర్తను నిలదీసింది ఆ ఇల్లాలు. భర్త చేసేది లేక అసలు నిజం చెప్పేశాడు. దానితో ఇప్పుడు తన బిడ్డ తనకు ఇవ్వాల్సిందేనంటూ ఆమె రోడ్డెక్కింది. మరోవైపు పురిటిలోనే తన ఒడిలోకి తీసుకుని పాలుపట్టి అనేక కష్టాలను పడి నాలుగేళ్ల పాటు పెంచి పెద్ద చేసిన తన చిట్టితల్లిని ఇప్పుడు కావాలంటే తను వదిలే ప్రసక్తే లేదని పెంచిన తల్లి అంటోంది. 
 
పైగా... వారు ఆనాడు గర్భస్రావం చేయించుకుంటామని అంటే... బిడ్డను చంపేయడం ఎందుకు... తాము తీసుకుంటామని, ఓ ఆర్ఎంపీ వైద్యుడు మధ్యవర్తిత్వంతో బిడ్డను తీసుకున్నట్లు ఆమె చెపుతున్నారు. తన బిడ్డను ఇప్పుడు తన నుంచి దూరం చేస్తే తన గుండె ఆగిపోతుందని ఆమె రోదిస్తోంది. విషయం కాస్తా చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్దకు వచ్చింది. వారు విచారణ చేపట్టారు. బిడ్డను ఎవరికి ఇవ్వాలో పాపకు డీఎన్ఎ పరీక్ష చేసిన తర్వాత తెలియజేస్తామన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.