1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:54 IST)

ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు వద్దు.. కేసీఆర్ కుమారుడుకి రామారావు పేరే ముద్దు : మోత్కుపల్లి

హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు పేరు పెట్టడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా ఖండించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు వద్దుగానీ, కేసీఆర్ తనయుడికి మాత్రం రామారావు పేరు ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టొద్దనే చెప్పేముందు.. తన కుమారునికి ఉన్న తారక రామారావు పేరును కేసీఆర్ మార్చాలని డిమాండ్ చేశారు. 
 
తెలంగాణాలోని ఎయిర్ పోర్టుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలతో కలిసి కేటీఆర్ ఎలా వ్యాపారాలు చేస్తారని ప్రశ్నించారు. పైగా.. ఆంధ్రా విద్యా సంస్థలో కేటీఆర్ విద్యాభ్యాసం చేయలేదా అని నిలదీశారు. 
 
తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ పేరును విమానాశ్రయానికి కొత్తగా పెట్టలేదనీ, పాత పేరునే తిరిగి పునరుద్ధరించారన్న కనీసం పరిజ్ఞానం కూడా కేసీఆర్‌, తెరాస నేతలకు లేదని విమర్శించారు. పైగా ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని, ఎన్టీఆర్‌ను అవమానపరుస్తూ శాసనసభలో మాట్లాడిన తీరుకు నిరసనగా రేపు ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేస్తానని చెప్పారు. కేసీఆర్‌కు, జానారెడ్డికి, జీవన్ రెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని మోత్కుపల్లి సూచించారు.