సాగర్ ఉప పోరు : సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష : కేసీఆర్
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగియనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ సెగ్మెంట్‌లో పోటా పోటీ ప్రచారం చేస్తున్నాయి.
ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆది నుంచి ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లర్లను ఆకర్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు ఓటు వేయాలని టీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా బహిరంగ సభకు బయలుదేరిన సీఎం కెసిఆర్. మార్గమధ్యంలో యాచారం వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. భారీ తరలివచ్చిన జనాన్ని చూసిన సీఎం తన వాహనం నిలిపి ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని ప్రకటించారు.
ఈ రోజు ఈ సభ జరగకూడదని, మీరు నేను కలవకూడదని చేయని ప్రయత్నం లేదు. ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో తలాతోక లేని వ్యవహారం ఇది. ఎవరైనా సభలు పెట్టుకుని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలు చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతరు. ఇది దేశ రాజకీయాల్లో ఉంది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలో ప్రధానితో సహా అందరూ విశేషంగా ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ జరగనీయొద్దని చాలా చాలా ప్రయత్నాలు చేశారన్నారు. ఉర్దూలో ఒక సామెత ఉంటది. ముద్దాయ్ లాక్ బురాకో చహతేతో క్యా హోతా.. వహీ హోతాహై కుదా మంజూర్ హోతాహై.
గతంలో హాలియా సభకు విచ్చేసినప్పుడు కూడా నేనే ఒకటే చెప్పినా. నేను చెప్పిందే వేదం అనుకోనవరం లేదని.. గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని.. ఆపై ఆలోచనతోని, పరిణతితో ఓటు ఇవ్వాలని. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. మన విచక్షణ ఉపయోగించాలి. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పితికితే పాలు రావు.. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయమంటే కాయవు.
పండ్ల చెట్లు పెడితేనే కాయలు కాస్తాయి. ఈ ప్రకారమే యోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు గెలిస్తే మంచిదో.. ఎవరు గెలిస్తే ఈ నియోజవర్గం అభివృద్ధి చెందుతదో మీరు ఇప్పటికే ఓ అవగాహన వచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి. నర్సింహయ్య వారసుడిగా మీకు తగు రీతిలో సేవ చేస్తడని నోముల భగత్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. భగత్ గాలి భాగానే ఉంది. ఇది ఓటు రూపంలో డబ్బాలోకి కూడా రావాలే అని సీఎం పేర్కొన్నారు.