ఓటర్ల జాబితా - ఆధార్ నంబరు అనుసంధానం .. స్వచ్ఛంధమే...
కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనుంది. అయితే, ఈ అనుసంధానం నిర్బంధం కాదని స్వచ్ఛంధమేనని పేర్కొంది. పైగా, ఈ డ్రైవ్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపింది.
ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారంతా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎన్నికల సంఘానికి తమ ఆధార్ సంఖ్యను సమర్పించాలి. అయితే ఇది పూర్తి స్వచ్ఛంధం. ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినంత మాత్రాన జాబితా నుంచి పేర్లు తొలగించరు. ఓటర్ల గుర్తింపును నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నారు.
ఓటర్ల జాబితాతో ఆధార్ సంఖ్యను లింక్ చేసుకునేందుకు ఎన్నికల సంఘం కొత్తగా ఫారం-6బీ దరఖాస్తును తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్, నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్ వెబ్‌సైట్లలో త్వరలో ఈ దరఖాస్తులు లభ్యమవుతాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా అనుసంధానించుకోవచ్చు.
బూత్ స్థాయి అధికారి తన పరిధిలోని ఓటరు జాబితాలో ఉన్న వారి ఆధార్ నంబర్లు తీసుకునేందుకు ఇంటింటికీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఆధార్ సంఖ్య అధికారులకు ఇవ్వాలా? వద్దా? అనేది ఓటరు ఇష్టం. ఆధార్ సంఖ్య ఇవ్వకుంటే దానికి బదులుగా ఫారం-6బీ దరఖాస్తులో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించొచ్చని పేర్కొంది.