బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (09:01 IST)

రాముడు తెలంగాణాకు.. రాముడు ఆస్తులు ఆంధ్రాకు!!

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం రాజ్యసభ ఆమోదముద్ర వేయడంతో భద్రాచలం రాముడు తెలంగాణ ప్రాంతానికి, ఆ రాముని ఆస్తుల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినట్టు అయింది. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదముద్ర వేయడంతో ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగానూ రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనంకానున్నాయి. 
 
అయితే ఈ విలీనం ప్రభావం భద్రాచలం శ్రీరాముడు మీద కూడా పడింది. దీని వల్ల భద్రాచలం శ్రీరాముడు తెలంగాణలో కొలువవుతుండగా.... ఆయన ఆస్తులలో చాలాభాగం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం కానున్నాయి. ముంపు మండలాలను ఏపీలో కలపనుండడంతో భద్రాచలం ఆలయానికి సంబంధించిన జటాయువు మందిరం కూడా ఏపీలో కలవనుంది. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవనుండడంతో జటాయువు మందిరం ఆంధ్రప్రదేశ్ సొంతం కానుంది.
 
రామాయణంలో జటాయువు పాత్ర చాలా ముఖ్యమైనది. జటాయువు ఒక వయసు మళ్లిన గద్ద. రాముడి తండ్రి దశరథుడికి మిత్రుడు జటాయువు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు పోతున్నప్పుడు.. రావణునితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రక్తసిక్త స్థితిలో సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి కనిపించి, రావణుడి వివరాలు చెప్పి వీరమరణం పొందుతాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా దాని దహన సంస్కారాలు చేసినట్టు రామాయణంలో ఉంది.