శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (15:49 IST)

చాక్లెట్‌ దొంగతనం.. ఐదో తరగతి విద్యార్థిపై థర్డ్ డిగ్రీ.. వరంగల్ ఖాకీల జులుం!

చాక్లెట్ దొంగతనం చేశాడన్న కోపంతో ఐదో తరగతి చదివే బాలుడిపై వరంగల్ పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రంతా ఠాణాలోనే ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వీరన్న. మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి, ఓ దుకాణానికి వెళ్లాడు. షాపులో వ్యక్తులు కనిపించకపోవడంతో వారిని పిలుచుకుంటూ లోపలికి వెళ్లాడు. ఇంతలోనే అతనితోపాటు వచ్చిన ఇద్దరు విద్యార్థులు షట్టర్ లాగి పారిపోయారు. 
 
లోపల చిక్కుకున్న వీరన్న షట్టర్‌ను కొడుతూ బిగ్గరగా కేకలు వేయడంతో పక్కనున్న వారితోపాటు దుకాణం యజమాని కూడా అక్కడికి వచ్చాడు. దుకాణంలో చాక్లెట్ దొంగతనానికి వచ్చావా? అంటూ బాలుడిని దూషించిన యజమాని అతడి జేబులోని రూ.300 తీసుకున్నాడు. అంతేగాక అతడిని పోలీసులకు అప్పగించాడు. మందలించి వొదిలేయాల్సిన పోలీసులు, అతడిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే బంధించారు.
 
విషయం తెలుసుకున్న వార్డెన్.. పిఎస్‌కు వెళ్లి బాలుడిని వదలాలని కోరినా పోలీసులు వినలేదు. రాత్రంతా స్టేషన్‌లోనే ఓ మొద్దుకేసి బాలుడిని కట్టేశారు. మీడియాకు ఈ విషయం తెలియడంతో బాలుడిని వార్డెన్‌కు అప్పగించారు. కాగా, బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనురాధారావు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని దుంగకు బంధించిన ఘటనలో ఎస్సై కృష్ణకుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో.. విచారణకు ఆదేశించారు.