శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (09:21 IST)

రామోజీ ఫిల్మ్ సిటీపై కేసీఆర్ వార్నింగ్స్ ఏమయ్యాయి : పొన్నం

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రామోజీ ఫిల్మ్ సిటినీ దున్నేస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రగల్భాలు, హెచ్చరికలు ఏమయ్యాయని టీ కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలు ప్రశ్నించారు. ఇదే అంశంపై వారు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలింసిటీని వెయ్యి నాగళ్లు కట్టి దున్నిస్తామన్న కేసీఆర్ హెచ్చరికలు ఏమయ్యాయని నిలదీశారు. పోలవరం విషయంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న కేసీఆర్ మాటమార్చడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
  
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీచార్జి చేయించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. చిల్లర పార్టీలంటూ ఎదురుదాడికి దిగడం, తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వంటి చర్యలు కేసీఆర్ అహంకార, నియంతృత్వ ధోరణికి నిదర్శమని వారు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని, హద్దుమీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.