1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:49 IST)

రేవంత్ రెడ్డి చేతికి టీ టీడీపీ పగ్గాలు ఇవ్వండి : వెలిసిన పోస్టర్లు!

తెలంగాణ టీడీపీ పగ్గాలను ఆ పార్టీ యువనేత రేవంత్ రెడ్డికి ఇవ్వాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పోస్టర్లు వెలిశాయి. ఇవి టీటీడీపీలో కలకలం రేపాయి. తెలుగు యువత పేరుతో ఆ పోస్టర్లు వెలిశాయి. శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కోరుతూ ఆ పోస్టర్లు అతికించారు. 
 
తెలంగాణ పార్టీ బాధ్యతలు రేవంత్‌రెడ్డికి అప్పజెప్పాలంటూ పోస్టుర్లు వెలిశాయి. తెలుగు యువత పేరుతో ఉన్న పోస్టర్లపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పోస్టర్ల వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ టిడిపి బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగిస్తూ వచ్చే పార్టీ మహానాడులో ప్రకటన చేయాలని పోస్టర్ల ద్వారా చంద్రబాబు నాయుడిని కోరారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తన వాగ్ధాటితో రేవంత్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు చేసిన పర్యటనను రేవంత్ రెడ్డి హైజాక్ చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మారాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.
 
మరోవైపు.. పోస్టర్ల వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. పోస్టర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇది ఆకతాయిలు చేసిన పనిగా స్పష్టం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ నాయకత్వంలో పనిచేస్తున్నాని వారితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే ఇలాంటి పనులు చేయవద్దని కోరారు. ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలో చంద్రబాబుకు అవగాహన ఉందని పేర్కొన్నారు.