శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (09:51 IST)

మాసాయిపేట రైలు ప్రమాదం: ఆ నాలుగు గ్రామాల్లో విషాదం!

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మాసాయిపేట కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో నాలుగు గ్రామాలకు చెందిన చిన్నారులు మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో ఈ నాలుగు గ్రామాల ప్రజలకు కడుపుకోత మిగిలింది. మాసాయిపేట ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులందరూ ఇస్లాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్‌, వెంకటాయ పల్లి గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. 
 
తమ చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కొందరు ఆ బాధను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మొత్తం ఈ నాలుగు గ్రామాల్లో కలిపి ఒకటి నుంచి పదో తరగతి దాకా చదివే 15 మంది విద్యార్థులు మరణించారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పేదవాళ్లే. 
 
కాగా, ఈ ఘోర రైలు ప్రమాదంపై రైల్వే పోలీసులు ఐపీసీ 304 ఏ, రైల్వే యాక్ట్‌లోని 152, 161 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.16 మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల నేపథ్యంలో రైల్వే పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.