50 రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర గురువారానికి యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర చేశారు. 50వ రోజున ఏకంగా 26 కిలోమీటర్ల దూరం రాహుల్ నడిచారు.
50వ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు భారీ సంఖ్యలో పాలుపంచుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా, 50వ రోజున తెలంగాణాలో ఏకంగా 26 కిలోమీటర్ల మేరకు నడిచారు.
ఇదిలావుంటే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర... 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలోని అడుగుపెట్టింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దాటేసి ఇపుడు తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, తెలంగాణాలో ఊహించినదానికంటే ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన రావడం గమనార్హం.
51వ రోజైన శుక్రవారం నారాయణ పేట జిల్లా ఎలిగండ్ల నుంచి రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నారాయణ పేట, దేవరకద్ర, పాలమూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. భోజన విరామ సమయంలో పోడు రైతులు, చేనేత కార్మికలతో రాహుల్ ముచ్చటించనున్నారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.