మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:21 IST)

తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ సిబ్బంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమ

ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి రూ.2 వేల నగదు సాయం, 25 కిలోల సన్నబియ్యం పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. చాలాచోట్ల భార్యాభర్తలిద్దరూ సిబ్బందే కావడంతో ఖాతాల్లో జమైన నగదు అందుకుని మురిసిపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న తమను సర్కారు ఆదుకుంటున్నదని సంతోషపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌, బాలాపూర్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కరీంనగర్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 2 వేల చొప్పున 1,12,843 మంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమచేశామని మంత్రి సబితా తెలిపారు. బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను తప్పుగా నమోదుచేయడంతో కొంతమంది ఖాతాల్లో రూ.2 వేలు జమకాలేదని, గురువారంలోగా వీరందరికీ జమచేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది రేషన్‌షాపు నంబర్లను పొరపాటుగా పేర్కొనడం వల్ల బియ్యం అందనివారికి.. రెండ్రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె ప్రకటించారు.

పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేవరకు ప్రతినెలా ఈ సాయం కొనసాగుతుందని ఆమె చెప్పారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని వాల్మీకి విద్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ 25 కిలోల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. మహబూబ్‌నగర్‌ జడ్పీ సమావేశ హాలులో బియ్యం, రూ.2 వేలను పంపిణీ చేశారు.
 
రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది: 1,25,302 మంది
 
రూ.2 వేలు ఖాతాల్లో జమైనవారు: 1,12,843 మంది
 
ఖాతాల్లో జమ చేసిన మొత్తం: రూ. 22.56 కోట్లు
 
రాష్ట్రంలో సన్న బియ్యం లబ్ధిదారులు: 1,13,600 మంది
 
పంపిణీ చేస్తున్న సన్నబియ్యం: 2,840 మెట్రిక్‌ టన్నులు
 
సన్నబియ్యం కోసం వెచ్చిస్తున్న మొత్తం: 10.75 కోట్లు
 
ఆర్థికంగా పెద్ద ఊరట
కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయం. బియ్యం, నగదు ఇవ్వడంతో ఆర్థికంగా పెద్ద ఊరట లభించింది. చాలామంది ఇదంతా ఉత్తదే, బియ్యం ఇయ్యరు. డబ్బులు పడవు అన్నారు. కానీ, సీఎం కేసీఆర్‌ సర్‌ చెప్పారు కచ్చితంగా ఇస్తారని నాకు గట్టి నమ్మకముండే. ఆఖరుకు నా విశ్వాసమే నిజమైంది.
-సూర్యచంద్ర, గీసుకొండ, వరంగల్‌
 
మా వెతలు తీర్చారు
16 ఏండ్లుగా ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్నా. మార్చి 21 నుంచి జీతాలు ఆపేశారు. ఆగస్టులో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి సగం జీతాలే ఇస్తున్నారు. వేరే దారిలేక టైలరింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మా వెతల తీర్చడం హర్షణీయం.
-సుబ్బలక్ష్మి, భరత్‌నగర్‌.