శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (15:34 IST)

తెలంగాణలో 5 నుంచి ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ కార్మిక సంఘాలతో సోమేష్‌కుమార్‌ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని తెలిపాయి. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్లాన్ బీ రెడీ చేసినా సమ్మె మాత్రం ఆగదని హెచ్చరించాయి.

ఆర్టీసీ కార్మికులు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరాయి. ఆర్టీసీ అధికారులతో, కార్మికులతో చర్చించినట్లు సోమేష్‌కుమార్ తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల 26 డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గడువు కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను కోరినట్లు వెల్లడించారు. సమ్మెపై ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బి రెడీగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ నెల 5 నుంచి సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించిన దరిమిలా ఐఏఎ్‌సలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.

ప్రజలకు మెరుగైన సేవలందించడానికి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇవ్వడానికి, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరి గే కార్యక్రమాలను పరిశీలించడానికి శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని కేబినెట్‌ నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ర్టీ పాలసీ రూపొందించాలని నిర్ణయించింది.
 
ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో, వారి డిమాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన ఆర్థిక, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణరావు, సునీల్‌ శర్మ సభ్యులుగా ఐఏఎస్‌ అధికారుల కమిటీని నియమించింది.

ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మిక యూ నియన్లతో చర్చిస్తుంది. వీలైనంత తొందరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కాగా, పేదలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది.

ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె యోచనను విరమించుకుని సహకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని, కమిటీతో చర్చించాలని సూచించింది. ప్రజలంతా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో సమ్మెకు దిగి వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరింది.