మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

సమ్మె విరమించి చర్చలకు రండి: తెరాస పార్లమెంటరీ నేత కేకే

సమ్మె విరమించి ఆర్టీసీ యూనియన్​ నేతలు చర్చలకు సిద్ధం కావాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కోరారు. పరిస్థితి చేయి దాటక ముందే సమ్మె విరమించాలని సూచించారు.

పరిస్థితి చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సూచించారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థల విలీనమంటే విధానాలు మార్చుకోవాలని కోరడమేనన్నారు. విలీనం, విధానాల మార్పన్నది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన తమ ఎజెండాలో లేదని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అద్దె బస్సులు, స్టేజీ క్యారేజీ నిర్ణయాలు సమ్మె నేపథ్యంలో తీసుకున్నవేనని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతో బాధించాయని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారాన్ని చూపవని పేర్కొన్నారు.
 
ఎమ్మెల్యే రోహిత్​రెడ్డిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
వికారాబాద్​ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్​రెడ్డిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. వికారాబాద్​ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్రిక్తతతకు దారితీసింది. ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అటువైపు వచ్చిన ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​రెడ్డిని అడ్డగించారు. తమ సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్​ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని, కొద్దిసేపట్లో వస్తానంటూ రోహిత్​రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం ఎమ్మెల్యేకు కార్మికులు వినతిపత్రం అందించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రోహిత్​రెడ్డి హామీ ఇచ్చారు. రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల పోలీసులు జోక్యం చేసుకొని కార్మికులకు నచ్చచెప్పారు.
 
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తీరు సరికాదు: కోమటిరెడ్డి
పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి సమ్మె చేస్తున్నా... ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయినా... ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు పోరాడి గెలవాలే తప్ప.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
 
జగన్​​ను కేసీఆర్​ ఆదర్శంగా తీసుకోవాలి
ఆర్టీసీ నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోజు రోజుకు సమ్మె ఉద్ధృతమతున్న నేపథ్యంలో ఆయన ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​... ఏపీ సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే కారణమని ఆరోపించిన జీవన్‌రెడ్డి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జగిత్యాల డిపోలో సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.