శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:24 IST)

హోం వర్క్ చేయలేదని తలపై కొట్టిన టీచర్.. మృతి చెందిన బాలిక

crime
హోం వర్క్ చేయలేదని టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ ఆ చిన్నారి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే, అర్సపల్లికి చెందిన 7 ఏళ్ల బాలిక ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న ఉడ్‌బ్రిడ్జి స్కూల్‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. సెప్టెంబర్ 2న ఫాతీమా చేయలేదని స్కూల్ టీచర్ ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిలబెట్టారు. స్కూల్ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడపై మోయించినట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది. 
 
అంతేకాకుండా చిన్నారి త‌ల‌పై స్కేల్‌తో కొట్టారు. ఆ తర్వాత ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే బాలికను హైదరాబాద్‌ తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం (సెప్టెంబర్ 6) మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
బాధిత బాలిక గత రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తన కుమార్తెను కొట్టిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్.. నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.