శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (15:59 IST)

తెలంగాణ తెరాస మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఓటరు లిస్టులో టీడీపీ ఎమ్మెల్యే!

తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు లిస్టును ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం సోమవారం విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను టీడీపీ ఎమ్మెల్యేగా పేర్కొన్నారు. టీడీపీ నుంచి గెలుపొందిన తలసాని ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
 
శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్యేగా ఓటరు లిస్టులో పేర్కొనడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించడానికి ఇది మంచి ఆధారంగా ఉంటుందని టీటీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తలసానితో పాటు తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి పేర్లను సైతం ఓటర్లు లిస్టులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా పేర్కొన్నారు. 
 
మరోవైపు వీరి ముగ్గురిపై టీటీడీపీ నేతలు ఈ ఉదయం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో తలసానిని టీడీపీ సభ్యుడిగా పేర్కొంటూ విడుదలైన జాబితాను సైతం ఓ ఆధారంగా టీటీడీపీ నేతలు కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
 
కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస తీర్థం పుచ్చుకునే సమయంలో ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన సనత్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయన శాసనసభ సభ్యత్వ రాజీనామాపై స్పీకర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోక పోవడంతో ఎమ్మెల్యే ఓటర్ల జాబితాలో ఆయన పేరును చేర్చినట్టు వినికిడి.