శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (13:10 IST)

నీటి కేటాయింపులపై సుప్రీంకు వెళ్తా... నేనే వాదిస్తా : కేసీఆర్ వెల్లడి

నీటి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయంలో ట్రైబ్యునల్‌లో న్యాయం జరగక పోతే సుప్రీంకోర్టుకెళ్ళి అవసరమైతే తానే వాదిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ప్రాజెక్టులు, నీటి పైన చర్చ సమయంలో కేసీఆర్ శాసన సభలో మాట్లాడారు. 
 
తెలంగాణ ప్రాజెక్టులను సమైక్య పాలకులు తొక్కిపెట్టారన్నారు. ప్రాజెక్టుల పైన తమ సర్కారు చిత్తశుద్ధితో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. ఎస్సెల్ బీసీ టన్నెల్ విషయంలో సమైక్య పాలకులు అనేక కొర్రీలు పెట్టారన్నారు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సుప్రీంను ఆశ్రయించామన్నారు. 
 
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. అలాగే పీటముడులు ఉన్నాయని చెప్పారు. ఎస్సెల్ బీసీ టన్నెల్ ఇంజనీర్లను తాను పిలిచి మాట్లాడానని తెలిపారు. పనులు ముందుకు సాగాలని రెండున్నర గంటలు వారితో మాట్లాడానన్నారు. అందుకోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేసి అందర్నీ పిలుస్తామన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి తీరాల్సిందే అన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణకు న్యాయం జరగాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీళ్లలో మన వాటా మనం సాధించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందన్నారు.