సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ... పదేళ్లు తానే సీఎం : కేసీఆర్
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, మరో పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు జరిగింది. ఇందులో వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.
ముఖ్యంగా సీఎం మార్పు ఊహగానాలపై ఆయన స్పష్టతఇచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని చురకలంటించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెడతారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
మరోవైపు ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజే ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ ద్వారా ప్రకటిస్తామని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకే కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మద్దతు సీఎం దిశానిర్దేశం చేశారు.