1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:37 IST)

తెలంగాణలో స్వైన్ ఫ్లూ.. ఆరోగ్య మంత్రిపై కేసీఆర్ గరంగరం.. ఊస్టింగ్ తప్పదా?

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి టి రాజయ్యపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గరంగరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ వైరస్ విస్తరిస్తుంటే.. మంత్రి మాత్రం మీడియా సమావేశాల్లో ఈ వైరస్ ప్రభావం పెద్దగా లేదని, అంతా మీడియా ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి చేయిదాటి పోవడంతో స్వైన్ ఫ్లూ‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్‌కు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పైగా.. హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో పర్యటించిన కేంద్ర ప్రత్యేక వైద్య బృందం స్వైన్‌ ఫ్లూ ఇస్తున్న వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇది కేసీఆర్‌కు మరింత ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది. దీనికితోడు వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున అవినీతికి తెరతీసిన రాజయ్య, ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్నట్లు లేదన్న కథనాలు కూడా వెలువడ్డాయి. దీంతో ఆయన ఆరోగ్య మంత్రిపై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని వదంతులు జోరందుకున్నాయి. బుధవారం కూడా హైదరాబాదులోనే ఉన్నా, తన శాఖలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం ఈ వదంతులకు బలం చేకూర్చుతోంది. 
 
నిజానికి రాష్ట్రంలో ఓ వైపు స్వైన్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తూ ఉంటే, రాజయ్య మాత్రం తన అవినీతి తంతులో నిండా మునిగిపోయి, అసలు పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రాజయ్య గురువారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతోనూ భేటీ అయ్యారు. తన కార్యాలయంలో ఓఎస్డీగా నియమించుకున్న ఓ అధికారి సహాయంతో రాజయ్య వసూళ్ల దందాకు తెరతీశారని కూడా సీఎం విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. 
 
ఈ తంతు ద్వారా కీలక పోస్టుల్లో నియమితులైన ముగ్గురు అధికారులపై సర్కారు గురువారం వేటు వేసిన విషయం తెల్సిందే. రాజయ్య తొలగింపు విషయంపై లోతుగా చర్చించిన సీఎం పలువురు కీలక నేతల అభిప్రాయం కోరారట. ఇందులో భాగంగా ఈసారికి వదిలేద్దాం, తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుందామని కొందరు చెప్పారట. మరికొందరు మాత్రం చర్యల పట్ల ఇప్పటికే ఆలస్యం చేశామని వాదించారట. దాదాపు సీఎం కేసీఆర్ కూడా ఇదే భావనతోనే ఉన్నారట. ఈ నేపథ్యంలో రాజయ్యకు ఊస్టింగ్ తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.