శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (09:30 IST)

అనవసరంగా బయటకు వస్తే తాటతీస్తాం : తెలంగాణ డీజీపీ

అనవసరంగా బయటకు వస్తే తాటతీస్తామంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, తెలంగాణలో లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు కానుంది. 
 
ఉదయం 10 గంటలతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపు ముగియనున్నప్పటికీ పని లేకున్నా వాహనాలపై బయటకు వచ్చే వారి పని పట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇకపై 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 
 
కాలనీలు, అంతర్గత రోడ్లలోనూ నిఘాను పెంచాలని సూచించారు. 10 గంటలకే అన్ని గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని, ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా చైతన్య పరచాలని సూచించారు. 
 
అలాగే, కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.