శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (16:50 IST)

తెలంగాణలో ర్యాగింగ్ క‌ల‌క‌లం: మంత్రి హరీష్ రావు సీరియస్

తెలంగాణలో ర్యాగింగ్ భూతం మ‌రోసారి ప‌డ‌గ‌విప్పింది. సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి త‌న‌పై సీనియ‌ర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్ప‌డ్డారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నెల ఒక‌ట‌వ తేదీన త‌న‌ను పిలిచి.. బ‌ట్ట‌లు విప్పించి ఫోటోలు, వీడియోలు తీశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. టిమ్మ‌ర్‌తో జ‌ట్టును తొల‌గించేందుకు య‌త్నించిన‌ట్లు తెలిపాడు. 
 
బాధిత విద్యార్థి దుస్తులను బలవంతంగా తొలగించిన సీనియ‌ర్లు అక్క‌డితో వ‌దిలేయ‌కుండా ట్రిమ్మర్‌తో జుట్టు తొలగించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. సీనియర్ల నుంచి తప్పించుకుని అత‌డు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఈ ర్యాగింగ్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
ఈ ర్యాగింగ్ ఘ‌ట‌న‌పై వైద్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కూడా స్పందించారు. ర్యాగింగ్ వంటి ఘటనల‌ను రాష్ట్ర‌ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించామని తెలిపారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని, కమిటీ నుంచి రిపోర్ట్ రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ర్యాగింగ్ జ‌రిగిందో లేదో తెలుసుకునేందుకే ఈ క‌మిటీ వేశామ‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.