శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (18:25 IST)

కోవిడ్‌ నేపథ్యంలో గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియను సరళతరం చేయండి: జనజాగృతి అకాడమీ

ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు ప్రక్రియ మార్గదర్శకాలను మరింత సరళతరం చేయాల్సిందిగా తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను జనజాగృతి అకాడమీ జనరల్‌ సెక్రటరీ కాసాని వీరేష్‌ కోరారు. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో  పాల్గొనడానికి ఓటర్లు విముఖత చూపే ప్రమాదం ఉంది కావున తక్షణమే తగిన చర్యలను ఈ దిశగా తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
 
మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు ప్రక్రియ పట్ల తగినంతగా ఓటర్లకు అవగాహన లేకపోవడం చేత అతి క్లిష్టమైన ఓటరు నమోదు ప్రక్రియ గురించి ఎన్నికల కమిషన్‌ తగిన దిద్దుబాటు చర్యలను తీసుకోవాల్సిందిగా వారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
 
తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌కు రాసిన ఈ లేఖలో కోవిడ్‌ నిబంధనల కారణంగా గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి వెల్లడించారు.

ఈ లేఖలో ఓటరు నమోదు ప్రక్రియ గడువును మరో 15రోజులు పొడిగించడంతో పాటుగా నూతన ఓటరు అప్లికేషన్‌లపై అభ్యంతరాలను డిసెంబర్‌ 31 వరకూ స్వీకరించాలని, అలాగే జనవరి 12వ తేదీ విడుదల చేయనున్న సప్లిమెంటరీ ఓటరు జాబితాలో నూతన ఓటర్లను జోడించాలని కోరారు. అలాగే అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికలలో అనుసరించిన రీతిలోనే ఓటరు సమాచార ధృవీకరణ తో పాటుగా విద్యార్హతలను కూడా  ధృవీ కరించాలని కోరారు.
 
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఈ లేఖను జగజాగృతి అకాడమీ జనరల్‌ సెక్రటరీ కాసాని వీరేష్‌ సమర్పించిన అనంతరం మాట్లాడుతూ ‘‘ఎన్నికల కమిషన్‌ ఓటరు నమోదు ప్రక్రియ గడువు తేదీ పొడిగించడంతో పాటుగా స్వీయ ధృవీకరణను అనుమతించాల్సిందిగా కోరుతున్నాం.

కోవిడ్‌ సమయంలో గెజిటెడ్‌ ఆఫీసర్లు మరియు నోటరీ ఆఫీసర్ల వెంట ఈ ధృవీకరణ కోసం తిరగడం వల్ల  ఓటర్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఓటరు నమోదు ప్రక్రియను  సరళీకృతం చేయకపోతే లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు నమోదు చేసుకోకపోయే ప్రమాదం ఉంది ’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.