డ్రగ్స్ కల్చర్‌కు చెక్.. వెయ్యి మందితో టీమ్.. తేడా వస్తే తాట తీయండి!
డ్రగ్స్ దందాపై తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు ఏకంగా 1000 మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ను నియమించింది తెలంగాణ సర్కారు. డ్రగ్స్ కట్టడి విషయంలో ఎంతటివారినైనా వదలొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా.. తిరస్కరించాలన్నారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దన్నారు. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్ కంట్రోల్ కోసం అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సెలరేషన్ ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు కేసీఆర్. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అసలు డ్రగ్స్ మాట వినిపించకూడదంటున్న సీఎం కేసీఆర్.. తేడా వస్తే తాట తీసేందుకు కూడా వెనకాడొద్దంటూ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో స్కాట్‌లాండ్ తరహా డ్రగ్ కంట్రోలింగ్ చేపట్టాలని సూచించారు.
డ్రగ్స్ నియంత్రణలో భాగంగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, యాడ్స్‌కు సబ్సిడీ కూడా ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.