బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (06:19 IST)

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని ఎంసిహెచ్ఆర్డీలో ఎలక్ట్రిక్ వాహనాలు -ఇంధన నిల్వల మీద ఈ రోజు జరిగిన సమ్మిట్ లో మంత్రులు కేటీఆర్, పువ్వాడ ఆజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాలు -ఇంధన నిల్వల పాలసీని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేలా, అటు కొనుగోలుదారులకు సైతం పెద్దఎత్తున లబ్ది చేకూర్చేలా పాలసీని రూపొందించడం జరిగింది.
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారి, ఇంధన నిల్వల విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని కలిగి ఉందన్నారు. ఈ విషయంలో "3D మంత్ర" విధానం (డీకార్బనైజేషన్, డిజిటైజేషన్, మరియు డీ సెంట్రలైజేషన్ ) తో ముందుకు వెళ్తున్నామన్నారు. 

కాలుష్య కోరల్లోంచి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన భాద్యత మన మీద ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగానే వాయి కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది తెలిపారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాలు -ఇంధన నిల్వల పాలసీని రూపొందించామన్నారు.  ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించే విధంగా పాలసీ రూపకల్పన జరిగిందన్నారు,

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దానికి కావాల్సిన అని మౌలిక వసతులను కల్పించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సిదంగా ఉందన్నారు. 
 
పాలసీ ముఖ్యాంశాలు: 
 
పరిశ్రమకు రాయితీలు 
1. రూ. 200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి సబ్సిడీ 
2. రూ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్లపాటు జీఎస్టీ  తిరిగి చెల్లింపు 
3. ఐదేళ్ల పాటు రూ. 5 కోట్ల పరిమితితో 25 శాతం విధ్యుత్ సబ్సిడీ    
4. రూ. 5 కోట్లకు తగ్గకుండా ఐదేళ్ల పాటు  60 శాతం రవాణా రుసుము, రూ. 5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ 
5. పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం 
6. స్టాంపు బదిలీ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ రుసుముల నుండి మినహాయింపు 
7. కొత్తరకం ఎలక్ట్రిక్ వాహనాల తయారు కోసం పరిశోధన అభివృద్ధి కేంద్రాల స్థాపన, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు 
 
కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు 
1. తెలంగాణాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు జరిగే తొలి  2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు అలాగే మొదటి 20 వేల  ఆటోలకు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలకు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలకు, 5 వేల కార్లకు, 500 బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్, రోడ్డు టాక్సీ నుండి మినహాయింపు

2. రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకునే ట్రాక్టర్లకు రోడ్డు టాక్సీ, రిజిస్ట్రేషన్ రుసుము 100 శాతం మినహాయింపు        
3. పారిశ్రామిక లాజిస్టిక్స్, రవాణా  కేంద్రాల పరిధిలో రాత్రిపూట పార్కింగ్ మరియు ఛార్జింగ్ సదుపాయాల కల్పన  

4. ఆటోలకు అదనంగా ఫిట్మెంట్ రాయితీల కింద రూ. 15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ 
 
ఛార్జింగ్ సౌకర్యాలు 
1. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో వాహనాలకు ప్రత్యే ఛార్జింగ్  కేంద్రాల ఏర్పాటు 
2. రాష్ట్ర విధ్యుత్ నియంత్రణ సంస్థ ద్వారా ఛార్జింగ్ కేంద్రాలకు ప్రత్యేక ఫీజు వసూలు 
3. టౌన్ షిప్ లలో ఛార్జింగ్ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు  
4. మహా నగరాలకు వెళ్లే జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ల చొప్పున ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు 
5. ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థలు తమ డిపోల దగ్గర ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు  
 
ఈ కార్యక్రమంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మహీంద్రా ఆండ్ మహీంద్రా  సీఈఓ డా. పవన్ గోయాంకా, ఎస్ బ్యాంకు ఛైర్మన్ సునీల్ మెహతా, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్,  ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.