చెరువు నీటిలో పడిపోయిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చెరువు నీటిలో పడిపోయారు. దీంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, చెరువుల పండుగను నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్‌లో జరిగిన చెరువులు పండుగ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నాటు పడవలోకి ఎక్కాలని భారత రాష్ట్ర సమితి నేతలు గంగులను కోరగా, వారి కోరిక మేరకు ఆయన పడవలోకి ఎక్కారు.
అయితే, ఆ పడవ అటూ ఇటూ ఊగుతూ మునిగిపోయింది. దీంతో పట్టు కోల్పోయిన గంగుల నీళ్ళలో పడిపోయారు. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.