సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (19:45 IST)

ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడొద్దు... మీకు మంచిది కాదు : మంత్రి హరీష్ రావు వార్నింగ్

harish rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రా మంత్రులూ ఎగిరెగిరి పడొద్దు అంటూ హెచ్చరించారు. తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారంటూ ప్రశ్నించారు. ఆంధ్రా మంత్రులూ అనవసరంగా మా జోలికి రాకండి. మా గురించి ఎక్కువ మాట్లడకపోతే మీకే మంచిది అంటూ హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. 
 
మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు.. ఏమందో వచ్చి చూడండి. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి అని హరీశ్ రావు ప్రశ్నించారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇపుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మినా ఎవరూ నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేసి మీ ప్రయోజనాలు చూసుకుంటారు. అధికార వైకాపా, విపక్ష టీడీపీలు కలిసి ఏపీని ఆగం చేశాయి అని ఆరోపించారు.