గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (13:19 IST)

వెన్నెల ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్.. రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం

rtc bus
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఒక బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలోని గంపులగ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య నడిచే ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వెన్నెల బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్స్ పని చేయలేదు. దీంతో ప్రయాణికులను దించి వేరే బస్సులో పంపించారు. ఆ తర్వాత సూర్యూపేట నుంచి ఏపీఎస్ ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సాయంతంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
 
ఈ క్రమంలో సాంకేతిక సమస్యతో ఆగిపోయిన బస్సులో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో ఆర్టీసీ బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.