శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (21:43 IST)

హైదరాబాద్ లోని పలు అంశాలపై కిషన్ రెడ్డి రివ్యూ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి శనివారం దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, నాబార్డ్, హడ్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ముందుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతితో జరిగిన సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని గృహనిర్మాణ పథకాలు, గృహాల కేటాయింపు తదితర అంశాలు చర్చించారు. బాపునగర్ స్కూల్ భవనం విషయం గురించి కూడా చర్చించారు.
 
అలాగే అంబర్ పేట గౌతులచ్ఛన్న ఆడిటోరియం(జ్యోతి బాయ్ పులే బీసీ సంక్షేమ భవన్) నిర్మాణం గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గడిచిన 16వ లోకసభా కాలంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభిృద్ధి నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలు, ప్రస్తుత ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చు గురించి కూడా చర్చించారు. జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల మీద విస్తృతంగా చర్చించారు.
 
జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో ప్రధానంగా అంబర్ పెట్ ఫ్లై ఓవర్ నిర్మాణం గురించి చర్చించి, నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అడ్డంకులను తొలగించి, నిర్మాణ పనులు  వేగవంతం చేయాలని సూచించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల(60 శాతం)తో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల పనితీరు గురించి మంత్రి అడిగారు. లాక్‌డౌన్ అనంతరం, స్వయం సహాయక సంఘాలు ఏ విధంగా పని చేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ యోజన కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో అధికారుల చొరవను అభినందిస్తూ ఇంకా చాలా చేయవలసి ఉందని సూచించారు. తర్వాత జరిగిన సమావేశంలో నాబార్డ్ తెలంగాణ రీజియన్ అధికారి శ్రీ వై. కె రావు, ఇతర అధికారులు పాల్గొని, రాష్ట్రంలో వివిధ పథకాలకు నాబార్డ్ ద్వారా అందుతున్న రుణ సహాయం గురించి తెలుసుకున్నారు.
 
హడ్కో అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా మంజూరు అయిన డబుల్ బెడ్రూం ఇళ్ల యూనిట్ల గురించి తెలుసుకున్నారు. సిఎస్ఆర్ నిధులతో చేపట్టే చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా హడ్కో అధికారి శ్రీ సుధాకర్ బాబు వివరించారు.