శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

రాజ్​భవన్​లో గవర్నర్​ దంపతుల విజయదశమి పూజలు

విజయదశమిని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్​భవన్​లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయదశమి వేడుకల్లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. పాలపిట్టను పంజరం నుంచి విడిపించి మురిసిపోయారు.

దసరా ప్రత్యేకతను, జమ్మి చెట్టు, పాలపిట్టను దర్శించుకుకోవటం వంటి అంశాల ప్రాశస్త్యాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్​ కుటుంబంతో పాటు... సిబ్బంది కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
 
జగన్మాత నామస్మరణతో మారుమోగిన భద్రకాళీ ఆలయం
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. కాకతీయుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.

ఉత్సవాల చివరి రోజు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజల కోసం ఆలయం ఎదుట వాహనాలు బారులు తీరాయి.

ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించనున్నారు.
 
జనగామ పోలీస్ స్టేషన్​లో ఆయుధ పూజ
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామలోని పోలీస్ స్టేషన్​లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్​లో ఆయుధపూజ నిర్వహించారు.

స్టేషన్​లోని ఆయుధాలతోపాటు పోలీస్ వాహనాలకు అర్చకుల మంత్రోచ్చారణలతో పూజలు చేయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలతో పాటు, పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు.
 
విజయదశమి రోజున జాతీయ జెండావిష్కరణ
మహబూబాబాద్​ జిల్లా గార్లలో ఆనవాయితీ ప్రకారం విజయదశమి రోజున మసీదు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మత సామరస్యానికి ప్రతీకగా విజయదశమి రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అరుదైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో జరిగింది.

స్వాతంత్రానంతరం గార్ల జాగీర్దార్​ పాలకులు ప్రతి దసరాకు ముస్లీం జెండాకు హిందూ దేవాలయంలో పూజలు జరిపించి మసీదు ఎదురుగా ఆవిష్కరించేవారు. హైదరాబాద్​ విలీనం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్​ జెండాను ఎగురవేశారు. వామపక్షం నాయకులు అభ్యంతరం తెలిపి, హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పుతో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.