బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:31 IST)

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికబరిలో రాములమ్మ?

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక శాసనసభ్యుడుగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఈ స్థానం నుంచి ఈ దఫా కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటి, తెలంగాణ ఉద్యమ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి 2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అటు రాములమ్మ కూడా పోటీ చేసే విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విజయశాంతి ఇప్పటికే పత్రిక ప్రకటనల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. 
 
మరోవైపు, దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ రఘునందన్ రావు మినహా పెద్ద నేతలెవరూ లేరు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం పోటీ పట్ల టీఆర్ఎస్‌లో అసంతృప్తి ఉంది. గ్రూపు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోంది. 
 
టికెట్ విషయంలో టీఆర్ఎస్‌లో ఉన్న అనిశ్చితి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌కు గ్రామ స్థాయి వరకూ ఉన్న కార్యకర్తల బలం విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. రాములమ్మకు టికెట్ విషయంలో పాజిటివ్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.