శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (13:29 IST)

సలసల కాగుతున్న నీటిని భర్తపై పోసింది.. వేధింపులు భరించలేక..?

భర్త వేధిస్తోంటే పుట్టింటికి వెళ్లిన మహిళలను చూసి వుంటారు. భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని తన మానాన తాను బతికే మహిళల గురించి కూడా విని ఉంటారు. కానీ ఓ మహిళ ఊహించని రీతిలో భర్తపై దాడి చేసింది. అతడిని తీవ్రంగా గాయాల పాలు చేసింది. కన్నకూతురితో కలిసి ఆమె చేసిన పనికి ఆ భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నొప్పులు భరించలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఓ లీటర్ నూనెను సలసలా మరిగించి భర్తమీద పోసింది. అంతే కాదు ఆ తర్వాత వెంటనే అతడి శరీరంపై కారం చల్లింది.
 
నూనె వేడికి బొబ్బలు రావడం, చర్మం ఊడటం, అలా చర్మం ఊడిన శరీరంపై కారం పడటం.. ఇక చూసుకోండి అతడి బాధ వర్ణనాతీతం. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్‌కు చెందిన 44 ఏళ్ల సదయ్య, రజిత దంపతులు కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్ట పరిధిలోని దీనబంధు కాలనీలో నివాసం ఉంటున్నారు. 
 
కొంతకాలంగా సదయ్యకు మతిస్థిమితం లేకపోవడం వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇటీవలే మళ్లీ కాస్త మమూలు మనిషిలా మారాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుండటంతో రజిత తన కుమార్తెతో కలిసి తరచు పుట్టింటికి వెళ్లేది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం మళ్లీ తన భర్త వద్దకు వచ్చింది.
 
సదయ్య జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముతూ ఉంటుంటారు. మంగళవారం సాయంత్రం కూడా అలా కూరగాయలు అమ్మేందుకు వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంట్లో భార్య, కూతురు ఉన్నారు. ఇంటి ప్రహరీకి ఉన్న గేటుకు తాళం వేశారు. తాళం తీయమని ఎన్నిసార్లు భార్యా కుమార్తెకు చెప్పినా తీయలేదు. ఇంట్లోనే ఉండి కూడా ఏమాత్రం స్పందించలేదు. దీంతో పక్కింటిలోకి వెళ్లి గోడ దూకి తన ఇంట్లోకి చేరుకున్నాడు. 
 
ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదేంటని నిలదీసేలోపే భార్య సలసల మరుగుతున్న వేడి నూనెను అతడిపై పోసింది. ఆ తర్వాత అతడిపై కారం చల్లి కుమార్తెతో సహా అక్కడి నుంచి పరారయ్యింది. స్థానికులు 108కు ఫోన్ చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.