1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:02 IST)

నేను పార్టీ పెట్టడం అన్న జగన్‌కు ఇష్టం లేదు.. కేసీఆర్, విజయమ్మ ఎక్కడ పుట్టారు?

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైఎస్ షర్మిల పదునైన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. బుధవారం విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకురాలు విజయశాంతిలు తెలంగాణ వాళ్లేనా? అని ప్రశ్నించారు. 
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ రాష్ట్రానికి చెందినవారు కాదని చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది హైదరాబాదులోనే అని తెలిపారు. దేవుడి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని షర్మిల అన్నారు. 
 
తెలంగాణ ఉద్యమంలో తాను లేనంత మాత్రాన ఈ ప్రాంతంపై తనకు ప్రేమ ఉండదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? తెలంగాణ ప్రజల కష్టాలు తీరాయా? అని అడిగారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాష్ట్రంలో గడపగడపకూ వెళ్లి వస్తానని చెప్పారు.
 
తాను పార్టీ పెట్టడం తన అన్న జగన్‌కు ఇష్టం లేదని షర్మిల అన్నారు. జగన్‌తో తనకున్నవి భిన్నాభిప్రాయాలో, విభేదాలో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. తనకు తన తల్లి విజయమ్మ మద్దతు ఉందని అన్నారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే మే 14 లేక జులై 9 అన్నది మీరే చెప్పాలంటూ విద్యార్థులను ఆమె అడిగారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తామని తెలిపారు.