శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2014 (14:02 IST)

సీనియర్ నటుడు నరేష్‌కి భరతముని ఉత్తమనటుడి అవార్డు

తెలుగు చలనచిత్ర సినిమాకి ఆద్యుడు రఘపతి వెంకయ్యనాయుడు. తన జీవితాన్ని సినిమాకే ధారపోసిన మహనీయుడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'రఘుపతి వెంకయ్యనాయుడు'. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు నరేష్‌  టైటిల్‌ పాత్ర పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఎల్లో లైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బాబ్జీ దర్శకత్వంలో మండవ సతీష్‌బాబు నిర్మించారు. ఈ సినిమాలో నరేష్‌ కనబరిచిన నటనకుగానూ భరతముని 27వ సినీ పురస్కారాల మహోత్సవంలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. 
 
నటుడిగా అనేక విలక్షణ పాత్రలకు ప్రాణం పోసిన నరేష్‌ ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. కథానాయకుడిగానే కాకుండా 'చిత్రం భళారే విచిత్రం'లో ఆయన వేసిన లేడీ గెటప్‌ సెన్సేషనల్‌ అయింది. చాలా చిత్రాల్లో నారదుడు గెటప్‌తో కూడా అలరించారు. అలాగే 'మీ శ్రేయోభిలాషి' చిత్రంలో ఆయన పోషించిన రోల్‌ని మనం మరచిపోలేం. 
 
మొన్నటి మొన్న 'దృశ్యం', 'చందమామ కథలు' సినిమాల్లో ఆయన పోషించిన క్యారెక్టర్లు.. ఇలా ఒకటేమిటి ఏ పాత్ర చేసినా దానికి తన నటనతో జీవం పోశారు. సీనియర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన రఘపతి వెంకయ్యనాయుడు వంటి చిత్రాన్ని సంవత్సరానికి ఒకటైనా చేయాలని అంటారు. ఈ భరతముని ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక కావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఆదివారం (డిసెంబర్‌ 14) సాయంత్రం జరగనుంది. 
 
ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ ''తెలుగు సినిమా చరిత్రలో ఈ 'రఘపతి వెంకయ్యనాయుడు' చిత్రం నిలిచిపోతుంది. భవిష్యత్‌ తరాలకు ఇది ఒక మైల్‌స్టోన్‌ మూవీ. మా అమ్మగారు విజయ నిర్మలగారికి రఘపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చిన సందర్భంలో ఆయన గొప్పతనం గురించి, సినిమా రంగానికి ఆయన చేసిన సేవ గురించి తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇలాంటి సినిమా చేయాలని మనసులో అనుకున్నా. 
 
ముందు ఒక డాక్యుమెంటరీగా ఈ సినిమాని తీద్దామనుకున్నప్పటికీ అటువంటి మహనీయుడు గొప్పతనాన్ని డాక్యుమెంటరీ రూపంలో చూపించలేమని సినిమాగా తీశాం. ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇటువంటి గొప్ప మహనీయుడి జీవితాన్ని సినిమాగా రూపకల్పన చేసిన దర్శకుడు బాజ్జీ, నిర్మాత మండవ సతీష్‌బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఈ చిత్రానికి భరతముని అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.