శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (17:50 IST)

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌... తాగలేదు మొర్రో అంటున్న అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షకు నిరాకరించడమే కాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం అవుతుండటంపై బన్నీ అల్లు అర్జున్ స్పందించాడు. ఆరోజు అర్థరాత్రి పోలీసులు నా కారును ఆపినమాట నిజమే, ఐతే అప్పుడు ఏం జరిగిందంటే, పోలీసులు నాకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష చేస్తామని చెప్పారు. అయితే కెమెరాలన్నీ నా మీద ఫోకస్‌ చేసి ఉంచడంతో తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని తెలిపానని... దీంతో మీడియా వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ తర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిగిందని... తాను మద్యం సేవించలేదని పరీక్షలో తేలిందని స్పష్టం చేశాడు.
 
మద్యం సేవించి నడిపే వారిని హైదరాబాదు పోలీసులు వదలరని... తగిన చర్యలు తీసుకోవడమో లేదా జరిమానా విధించడమో చేస్తారని చెప్పాడు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అల్లు అర్జున్ అంటూ పలు వెబ్ సైట్లలో వీడియోలను పోస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఒక వేళ తాను మద్యం సేవించినట్టైతే.. నడిచి వెళ్లడమో, మరొకరిని డ్రాప్ చేయమని అడగడమో, ట్యాక్సీ లేదా ఆటోలో వెళ్లడమో చేసేవాడినని చెప్పాడు.