శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (13:16 IST)

అల్లు అల్లిన బాట... మెగా ఫ్యామిలీ పూదోట...

ఇండస్ట్రీలో వారసత్వాలు లేని రోజుల్లో నాటకాల నుంచి వెలుగులోకి వచ్చిన నటుడు అల్లు రామలింగయ్య. హోమియోపతి వైద్యాన్ని తన తండ్రి వద్ద నేర్చుకున్న ఆయన చదువుసంధ్యల వైపు మనస్సు పెట్టకుండా.. ఆటపాటలతో మిమిక్రీలు చేస్తూ కాలం గడిపేవాడు. నాటకాల్లో సీనియర్స్‌ స్పూర్తితో అప్పట్లో సినిమాల వైపు మొగ్గారు. అప్పటినుంచి హాస్యంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్‌ 1. ఈ సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తుచేసుకుందాం. 
 
చిన్నవేషంతో మెప్పించారు 
 
పాలకొల్లులో 1922 అక్టోబర్‌ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. ఆయన సరదాగా జీవితాన్ని గడిపేవారు. ఎక్కువగా జోకులు, చలోక్తులు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. అదే ఆయన నటనకు ఉపయోగపడింది. ప్రజానాట్యమండలిలో నాటకాలు వేస్తూ.. క్రమేణా సినిమాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో వున్న కొద్దిపాటి అవగాహనతో 'భక్త ప్రహ్లాద నాటకంలో 'బృహస్పతి' వేషం వేసి మెప్పించారు. 
 
సినీ జీవితం: 
అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్ర సీమలో తొలిసారిగా 1952లో 'పుట్టిల్లు' చిత్రంలో కూడుగుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే చేయించారు. ఆ తర్వాత హెచ్‌ఎం రెడ్డి 'వద్దంటే డబ్బు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సమయంలోనే తన మకాం మద్రాసుకు మార్చారు. మొదట్లో అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏ మాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్య సేవలందించేవారు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలదొక్కుకున్నారు. అల్లు హాస్యపు జల్లునే కాదు కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తికట్టించారు. 
 
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి 'మూగ మనసులు', 'దొంగరాముడు', 'మాయా బజార్‌', 'ముత్యాల ముగ్గు', 'మనవూరి పాండవులు', 'అందాల రాముడు', 'శంకరాభరణం' వంటి చిత్రాలు బాగా ఆదరణపొందాయి. ఆయన సినీ జీవితంలో సుమారు 1030కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, సలహాదారుడిగా, విమర్శకుడిగా, నిర్మాతగా పని చేసి తెలుగు సినీ పరిశ్రమలో ఎదురులేని నటుడిగా ఎదిగారు. ఆయన విలన్‌ పాత్రల్లోనూ నటించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. అంతేకాదు పాటలు కూడా రాసేవారు. అల్లు రామలింగయ్య రాసిన పాటకు బాలు గానం తోడైతే ఆ మజానే వేరని అంటుండే వారు సినీ పెద్దలు. ఆయన రాసిన పలు జానపద పాటలు అప్పట్లో సాధారణ ప్రజలని బాగా ఆకట్టుకున్నాయి. 
 
గౌరవాలు: 
నాగభూషణం, రావుగోపాలవు, రాజబాబు, ఇలా ప్రతి ఒక్కరితోనూ నటించిన ఆయన ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని కనబరిచేవారు. యాభై యేళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్‌ తెలుగు ప్రజానికాన్ని అలరించిన అల్లు రామలింగయ్యను వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అనేకం. భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత పద్మశ్రీ అందుకున్న హాస్యనటుడు అల్లునే. 2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. 
 
అల్లు రామలింగయ్య 2004 జులై 31వ తేదీన తన 82వ ఏట కన్నుమూశారు. ఆయన భౌతికంగా మనముందు లేకున్నా.. సినిమా రూపంలో ఎప్పుడూ కవ్విస్తూ.. నవ్విస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే 2013లో భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో ఆయన జ్ఞాపకార్థం ఓ తపాల బిళ్లను విడుదల చేశారు. 
 
ఆయన వేసిన సినీ బీజంలో అల్లుడు చిరంజీవి, కొడుకు అరవింద్‌ నిర్మాతగా, ఆయన మనవళ్లు అల్లు అర్జున్‌, శిరీష్‌లు హీరోలుగా, చిరంజీవి కుటుంబానికి చెందిన పలువురు సినీరంగంలో నిలదొక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఇప్పటికే గుర్తింపు పొందారు.