శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (22:22 IST)

బాపుది మరణం కాదు.. రమణ చెంతకు వెళ్లారు!

దర్శక దిగ్గజం బాపు మరణించలేదని, ఆయన తన స్నేహితుడు రమణ చెంతకు చేరుకున్నారని సీనియర్ నటుడు చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ దర్శకుడు బాపు మరణించడం పట్ల సీనియర్ నటుడు చంద్రమోహన్ స్పందిస్తూ... బాపు ఎక్కడికీ వెళ్ళలేదని, మన మధ్యే ఉన్నారన్నారు. గీసిన బొమ్మల్లో, తీసిన చిత్రాల్లో ఆయన సజీవంగానే ఉన్నారని పేర్కొన్నారు. భౌతికంగా లేకపోయినా, తన కళ ద్వారా బాపు బతికే ఉంటారని తెలిపారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం బాపు ఉంటారన్నారు.  
 
కాగా, ప్రముఖ దర్శకుడు బాపు ఆదివారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయనకు.. ఆదివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 
 
తెలుగు చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన దర్శకుల్లో బాపు ఒకరు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. బాపు 1933 డిసెంబర్ 15న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కంతేరు. ఆయన తొలి చిత్రం సాక్షి (1967) కాగా, చివరి చిత్రం శ్రీరామరాజ్యం (2011). దర్శకుడిగా రెండు జాతీయ అవార్డులు, ఐదు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
 
మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఆయన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు అందుకున్నారు. మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణతో ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే. బాపు చిత్రకారుడిగానూ, కార్టూనిస్టుగానూ ఎంతో ప్రసిద్ధికెక్కారు. 2013లో ఆయనకు కేంద్రం పద్మశ్రీ ప్రదానం చేసింది. 1991లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 
 
దర్శక దిగ్గజం బాపు మరిలేరన్న విషయం తెలియడంతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులు విచారంలో మునిగిపోయారు. దీనిపై సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు తదితరులు స్పందించారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాపు తన ఆత్మబంధువులాంటి వారని జొన్నవిత్తుల పేర్కొన్నారు.