'దృశ్యం' సక్సెస్... నేననుకున్నది నిజమైంది... రామానాయుడు

drushyam success meet
IVR| Last Modified శనివారం, 26 జులై 2014 (18:04 IST)
27 ఏళ్ళ సినీ కెరియర్‌లో 'దృశ్యం' మరిచిపోలేని సినిమా. నటుడిగా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన చిత్రమిది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న తరుణంలో ఇటువంటి ఫీల్‌గుడ్‌ మూవీ రావడం చాలా ఆనందంగా ఉంది. నాతో ఓ మంచి సినిమా చేసిన శ్రీప్రియకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని విక్టరీ వెంకటేష్‌ అన్నారు. వెంకటేష్‌, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మించిన చిత్రం 'దృశ్యం'.

డి.రామానాయుడు సమర్పించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకుని కట్‌చేసి సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకొందీ చిత్ర బృందం. ఇంకా వెంకటేష్‌ మాట్లాడుతూ... శ్రీప్రియతో పనిచేయడం వండర్‌ఫుల్‌గా ఉంది. కోస్టార్స్‌ అందరూ బాగా చేశారు అని అన్నారు.

రామానాయుడు మాట్లాడుతూ... మా సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో లేడీ డైరెక్టర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద హిట్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఫస్ట్‌ కాపీ చూసి సినిమా హిట్‌ అని చెప్పాను. అదే నిజమైంది. ఇక్కడి నుండే కాకుండా అబ్రాడ్‌ నుండి కూడా మిత్రులు ఫోన్‌ చేసి సినిమా బావుందని చెబుతున్నారు. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా ఇది అని తెలిపారు.

శ్రీప్రియ మాట్లాడుతూ... దృశ్యం' తెలుగులో చెయ్యాలనుకున్నప్పుడు హీరో ఎవరైతే బావుంటుందని జయసుధ, జయప్రద, రాధికలు అడిగినప్పుడు వెంటనే వెంకటేష్‌ అయితే బెస్ట్‌ అని చెప్పారు. వెంటనే ఆయనకు, సురేష్‌ బాబుకి సినిమా గురించి చెప్పడం, ఓకే అనడం జరిగిపోయాయి. 43 రోజులు షూటింగ్‌కి సురేష్‌ బాబు ఎంతగానో సహకరించారు. వెంకటేష్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బావుంది అన్నారు. మీనా మాట్లాడుతూ... తెలుగులో చాలాకాలం తరువాత చేసిన మంచి పాత్ర ఇది. అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

వెంకటేష్‌ జెంటిల్‌మెన్‌... నదియా
విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌కి కంగ్రాట్స్‌. శ్రీప్రియతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బావుంది. ఇందులో చాలెంజింగ్‌ రోల్‌ చేశాను. ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాననుకుంటున్నాను. జెంటిల్‌మెన్‌ లాంటి వెంకటేష్‌తో కలిసి పనిచేయడం తీయని అనుభూతి. వండర్‌ఫుల్‌ పర్సన్‌ ఆయన. తెలుగు ఆడియన్స్‌ నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఇకపై కూడా తెలుగులో మీనింగ్‌ఫుల్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తాను అని అన్నారు.

డి.సురేష్‌బాబు మాట్లాడుతూ... ఆడియన్స్‌ మెచ్చిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలు పొందింది. టెక్నిషియన్లు మనసు పెట్టి పనిచేశారు. అతి తక్కువ సమయంలో సినిమా పూర్తి చేశాం అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... 50 ఏళ్ళు ఒక సంస్థని విజయవంతంగా నడపడం గొప్ప విషయం. ఈ సంస్థలో 40కు పైగా సినిమాలు రాసాం. నాయుడుగారిలో తండ్రిని చూసుకుంటాం.

నిర్మాతగా, నటుడిగా గొప్ప కొడుకుల్ని ఇండస్ట్రీకి ఇచ్చారు. కలియుగ పాండవులు చిత్రం నుండి వెంకటేష్‌కి పాత్రలో ఇన్‌వాల్వ్‌ అయ్యి చేయడం తెలుసు. అదే అతని సక్సెస్‌కి కారణం. ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. చక్కని ఫ్యామిలీ చిత్రమిది అన్నారు.దీనిపై మరింత చదవండి :