శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (16:12 IST)

మాండలిన్ శ్రీనివాస్ ఇకలేరు : దేవీ శ్రీ ప్రసాద్ ఈయన శిష్యుడే!

ప్రముఖ మాండలిన్ వాయిద్య విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కాలేయ మార్పిడి చికిత్స విఫలం కావడంతో ఆయన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. ఆయనకు వయస్సు 45 యేళ్లు. పాలకొల్లులో పుట్టిన ఆయన.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన శిష్యుడిగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన దేవిశ్రీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెల్సిందే. 
 
మాండలిన్ వద్ద డీఎస్పీ 12 ఏళ్ల పాటు శిష్యరికం చేశాడు. దేవి ఆయన దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. హైస్కూల్‌లో చదువుతుండగా సంగీతం మీద దేవి ఆసక్తిని గమనించిన అతని తల్లి శిరోమణి చెన్నైలోని మాండలిన్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకువెళ్లింది. తొలి పరిచయంలో దేవిశ్రీ ప్రసాద్‌ను ఏదైనా ఒక పాట పాడమని మాండలిన్ శ్రీనివాస్ కోరాడు. వెంటనే, దేవి తన అభిమాన గాయకుడైన మైకేల్ జాక్సన్ పాటను పాడాడు. ఆ పాట విన్న వెంటనే చిరునవ్వు నవ్వి... అదే పాటను అత్యద్భుతంగా మాండలిన్‌పై శ్రీనివాస్ వాయించారు. దీంతో అచ్చెరువొందిన దేవి సంగీతంలో ఇకపై తన గురువు మాండలిన్ శ్రీనివాసే అని మనస్సులో గట్టిగా నిశ్చయించుకుని, 12 యేళ్ళపాటు శిక్షణ పొందాడు. 
 
ఒక్క స్కూల్ టైంలో తప్ప మిగతా సమయమంతా మాండలిన్ శ్రీనివాస్ ఇంట్లోనే గడిపేవాడు. మద్రాస్‌లో ఏ కచ్చేరీ చేసినా... దేవిశ్రీ ప్రసాద్ ఆయన వెంట ఉండేవాడు. కచేరీకి ఏర్పాట్లు చేయడం... వాయిద్యాలు అందించడం ఇవన్నీ దేవి దగ్గరుండి చూసుకునేవాడు. తన గురువు సంగీతం నేర్పడానికి ఎవరి దగ్గరా డబ్బు తీసుకునేవారు కాదని... శిష్యులకు ఏం అవసరమో అన్నీ ఆయనే స్వయంగా సమకూర్చేవారిని దేవిశ్రీ ప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండలిన్ శ్రీనివాస్ తన శిష్యుల మీద ఎప్పుడూ కోప్పడేవారు కాదని... శిష్యుల్లోని ప్రతిభా పాటవాలు వాటంతట అవే బయటకు వచ్చేలా ఆయన శిక్షణ ఇచ్చేవారని దేవి వెల్లడించాడు.