శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 డిశెంబరు 2014 (17:39 IST)

ముకుంద రివ్యూ రిపోర్ట్: వరుణ్ తేజ్‌కు హిట్టా.. ఫట్టా..!

నటుడు, నిర్మాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా ‘ముకుంద’ బుధవారం నాడు విడుదలైంది. నటీనటులు: వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డే, నాజర్‌, రావురమేష్‌, రఘుబాబు, అర్జున్‌సింగ్‌, అలీ తదితరులు
 
నిర్మాత: నల్లమలుపు బుజ్జి, సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.
 
హీరోగా చిరంజీవి కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు వరుణ్‌తేజ్‌. అంతకుతప్పించి ఆయనలో ప్రత్యేకత ఏమీలేదు. నాగబాబు కొడుకు అనేది ఫ్యాన్స్‌లో క్రేజ్‌. ఫ్యాన్స్‌ అంతా వారసత్వం వారసుల్ని ఆదరించినట్లే తమ వారసుడుని ఆదరిస్తారని మెగాఫ్యామిలీ ఆశించింది. దానికోసం నటనలో కొంత శిక్షణ తీసుకుని ప్రజలపై వదిలింది. దీనికి దర్శకుడిగా కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలపై బరువు పెట్టింది. మరి ఆ బరువును దర్శకుడు మోసేలా చేశాడాలేదా? చూడాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
 
కథ: 
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ముకుంద (వరుణ్‌తేజ్‌) ఫ్యామిలీ వుంటుంది. తండ్రి పరుచూరి వెంకటేశ్వరావు మార్కెట్‌లో వుల్లిపాయల వ్యాపారి. కొడుకుపై నమ్మకంతో అతనికి ఫ్రీడమ్‌ ఇస్తాడు. డిగ్రీ వరకు చదివి ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటాడు. అదే టైంలో ఊరిలో 25 ఏళ్ళుగా మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని అనుభవిస్తున్న రావురమేష్‌ ఈసారికూడా గెలవాలని ఎలక్షన్లలో భారీగా ఖర్చుచేస్తుంటాడు.
 
అతనికి ఇద్దరు కుమార్తెలు. మొదటిది పూజ (పూజాహెగ్డే) కాగా, మరో అమ్మాయి పవిత్ర. పవిత్ర.. ముకుంద స్నేహితుల్లో ఒకరిని ప్రేమిస్తుంది. తమ కులంకాదని స్థాయికి సరితూగడని అతన్ని రకరకాలుగా వార్నింగ్‌లు ఇస్తూ సీరియస్‌గా ఎటాక్‌ చేయిస్తాడు. ఎప్పటికప్పుడు ముకుంద స్నేహితుడ్ని కాపాడుతుంటాడు. అందుకు తను శిక్షకుకూడా గురవుతాడు. ప్రాణాలతో బయటపడ్డ ముకుంద... ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో చైర్మన్‌ పదవికి పోటీగా సమాజంపై విసుగుచెంది.. పిచ్చివాడిలా రోడ్డుమీద తిరిగే ప్రకాష్‌రాజ్‌ను నిలబెడతాడు. ఆ తర్వాత కథ ఎటువైపు తిరిగింది? అనేది సినిమా.
పెర్‌ఫార్మెన్స్‌ 
నటనాపరంగా తాను కొత్తవాడినని ముందే చెప్పడంతో వరుణ్‌తేజ్‌పై ఏమంత అంచనాలు లేవు. నటుడిగా ఇంకా చాలా నేర్చుకోవాలి. డాన్స్‌లు, ఫైట్లు పెద్దగా రావు. డైలాగ్‌ డెలివరీ చాలా సింపుల్‌గా వుంది. వాయిస్‌ పర్వాలేదు. పూజా హెగ్డే పాత్ర పెద్ద ప్రాధాన్యత వుండదు. విలన్‌ కూతురుగా హీరోను మౌనంగా ప్రేమించే పాత్రలో నటించింది. ఆమె చెల్లెలుగా కొత్తమ్మాయే నటించింది. గ్రామాల్లో చైర్మన్లు వుండేవిధంగా రావురమేష్‌ పాత్ర తీర్చిదిద్దారు. డైలాగ్‌ డెలివరీ అంతా చాలా స్లోగా.. సీతమ్మవాకిట్లో... వున్న స్టైల్‌నే దర్శకుడు ఇందులో చేయించాడు. ఇక మిగిలిన పాత్రలు మాములుగానే వున్నాయి.
 
టెక్నికల్‌గా..... 
సంగీతపరంగా మిక్కీజె మేయర్‌ ట్యూన్స్‌ మెలోడినే. దర్శకుడి టేస్ట్‌నుబట్టి సంగీతముంది. పెద్ద పెద్ద వాద్యాలతో భయపెట్టే ట్యూన్స్‌లేవు. సాహిత్యంకూడా వినడానికి బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడింగ్‌లో ఇంకాస్త శ్రద్ధపెట్టాల్సింది. అర్జున్‌సింగ్‌ ఎంట్రీలో హీరో ఎలా ప్రవేశిస్తాడో అర్థంకాదు. ఇలాంటికి కొన్ని వున్నాయి. డైలాగ్స్‌ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సీతమ్మవాకిట్లో...తరహాలోనే పొందికైన డైలాగ్‌లతో దర్శకుడు లాగించేశాడు. అందుకు హీరో క్యారెక్టర్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని రాయించినట్లుంది.
 
విశ్లేషణ‌... 
సినిమా కథ సింపుల్‌స్టోరీ. ఒక ఊరిలో చైర్మన్‌ అరాచకాలను అరికట్టే యువత కథ. బ్లాక్‌ అండ్‌ మూవీలనుంచి వచ్చిన సమస్య.. నేడూ రన్‌ కావడం కథలోని విషయం. ఆ విషయాన్ని చాలా లైటర్‌ వేలో దర్శకుడు డీల్‌ చేశాడు. దాంతో ఎక్కడా సీరియస్‌నెస్‌ కన్పించదు. పొందికైన డైలాగ్‌లపై వున్న శ్రద్ధ కథను వ్యక్తం చేయడంలో లోపించింది. ఊరిలో చైర్మన్‌ ఎలక్షన్ల తర్వాత వచ్చిన ఫలితాలు ప్రకాష్‌రాజ్‌ గెలుస్తాడు. ఆ తర్వాత గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది. విలన్‌గా తన పట్టుపోవడంతోపాటు కూతురు ప్రేమించినవాడ్ని చంపించడం, తిరిగి అతను బతికిరావడం వంటివాటితో కథ పక్కదారి పట్టింది.
 
ఇదిలా వుండగా, మౌనంగా ప్రేమించుకునే ప్రేమికులు ముకుంద, పూజ విషయంలో సరైన లవ్‌ ట్రాక్‌ లేదు. దాంతో ప్రేక్షకుడి ఫీల్‌ చాలా మిస్‌ అయినట్లు కన్పిస్తుంది. హైదరాబాద్‌ నుంచి పోలీసు ఆఫీసర్‌ నాజర్‌ క్యారెక్టర్‌ కూడా ఆసక్తికరంగా లేదు. అటు కథ విషయంలో సరైన ముగింపు కూడా లేకపోవడంతో సినిమా తేలిపోయింది. తొలి సినిమాలో వున్న తప్పులు తర్వాత సినిమాలో చక్కదిద్దుకోవడానికి మాత్రమే హీరోకు పనికివస్తుంలేది తప్పితే.. ప్రేక్షకుడికి ఏ మాత్రం ఉపయోగంలేని సినిమా. అయితే ఒక్క విషయం కాదనలేనిది. కుటుంబంతో చూడతగ్గచిత్రమిది. 
 
కొసమెరుపు: క్లైమాక్స్‌లో దర్శకుడు శేఖర్‌కమ్ముల కన్పించి ఓ సందేశం ఇస్తాడు. ఆ సందేశం తెలిసిందే అయినా బాగుంది నీ గురించి నువ్వు తెలుసుకో. నీ బలం, బలహీనతలుకూడా అప్పుడే పైకి వస్తావనేది సందేశం.
 
రేటింగ్: 2.5/5